గాంధీ నివాసం కొనుగోలుకు బొగ్గు శాఖ యత్నాలు

బుధవారం, 5 ఆగస్టు 2009 (18:04 IST)
దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్‌లో మహాత్మాగాంధీ నివాశించిన ఇంటిని కొనుగోలు చేసేందుకు కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నివాసంలో గాంధీ ఒక యేడాదికి పైగా నివాసం ఉన్నారు. ఆ నివాసాన్ని కొనుగోలు చేసి, స్మారక మందిరంగా చేయాలని కోల్ ఇండియా ప్రతినిధులు నిర్ణయించారు.

దీనిపై బోగ్గు మంత్రిత్వ శాఖామంత్రి శ్రీ ప్రకాష్ జైశ్వాల్ స్పందిస్తూ.. దక్షిణాఫ్రికాలో గాంధీజీ నివశించిన ఇంటిని కొనుగోలు చేసి, స్మారక మందిరంగా మార్చాలనే ఉద్దేశం ఉన్నట్టు బుధవారం చెప్పారు. ఎంత ధరకైనా ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.

అలాగే, తనతో పాటు తమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈనెల 17వ తేదీన ఈ వ్యవహారంపై దక్షిణాఫ్రికాకు వెళ్లి, ఆ ఇంటి కొనుగోలుకు సంబంధించి బిడ్ దాఖలుపై యజమానితో చర్చలు జరుపనున్నట్టు చెప్పారు. ఒకవేళ మన దేశానికి చెందిన ఇతర సంస్థలు ఏవైనా సరే.. ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు బిడ్ దాఖలు చేసిన పక్షంలో తాము వెనక్కి తగ్గుతామని మంత్రి తెలిపారు.

అంతేకాకుండా, దేశంలోని ప్రముఖ నేతలకు సంబంధించిన ఆస్తులను కొనుగోలుకు తమ శాఖ ప్రయత్నిస్తుందన్నారు. కాగా, జోహెన్స్‌‌బర్గ్ శివార్లలోని ఆర్చర్డ్స్‌ అనే ప్రాంతంలోని ఒక ఇంటిలో మహాత్మా గాంధీ 1908 నుంచి 1909 మధ్య కాలంలో నివశించారు. ఆ సమయంలో ఆయన దక్షిణాఫ్రికా గడ్డపై ఎదురైన జాతివివక్షను ఎదుర్కొని న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అయితే, ఈ గృహం యజమాని నాన్సీ బాల్ గత 25 సంవత్సరాలుగా ఆ ఇంటిలో నివశిస్తున్నాడు.

ఆమె కేప్‌టౌన్‌కు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో తన సొంత ఇంటిని విక్రయించేందుకు సిద్ధమయ్యారు. కాగా, ఇంటి ధర 350,000 అమెరికన్ డాలర్లుగా చెపుతోంది. అయినప్పటికీ... పలువురు ధనవంతులు ఈ నివాసాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇలాంటి వారిలో గాంధీజీ ముని మనుమరాలు కిట్టీ మీనన్ కూడా ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి