గుజరాత్ కాక్రాపారా అణు విద్యుత్ కేంద్రంలో లీకేజీ!!

బుధవారం, 3 ఆగస్టు 2011 (09:38 IST)
గుజరాత్ రాష్ట్రంలోని కాక్రపారా అణు విద్యుత్ కేంద్రం నుంచి రేడియోధార్మికత లీక్ అయినట్టు నిపుణులు గుర్తించారు. ఈ లీకేజీ పెయింటింగ్ విభాగంలో చోటు చేసుకుంది. ఫలితంగా ఇక్కడ కాంట్రాక్టు పెయింటింగ్ కార్మికులు జయ్‌సింగ్, బచ్చు, దినేష్, దిలేష్ రేడియో ధార్మికతకు గురయ్యారు. గడచిన మే 30న లీకేజీ చోటుచేసుకోగా బాధితులను తక్షణం అక్కడి ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించడంతో వారి శరీరాల్లో 90.72, 66.12, 58.70, 23.23 మిల్లీ సీవర్ట్‌ల పరిమాణంలో ధార్మికత ప్రభావం ఉన్నట్లు తేలింది. ఈ విషయం తాజాగా వెల్లడైంది.

ఈ లీకేజీ కర్మాగారం నుంచి అణు వ్యర్థాన్ని బదిలీ చేసే ప్రదేశంలో కంట్రోల్ రూం నుంచి రెండు వాడేసిన ఇంధన బండిళ్లు అనుకోకుండా విడుదలయ్యాయి. దీంతో ధార్మిక క్షేత్రం విస్తరించి, అక్కడికి సమీపంలో పనిచేస్తున్న నలుగురు పెయింటింగ్ కార్మికులు దాని బారినపడినట్టు ప్లాంట్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఈ రేడియోధార్మికత ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపగల మోతాదు (100 మిల్లీ సీవర్ట్‌లు) కన్నా తక్కువ స్థాయిలోనే ఉందని ప్లాంటును నిర్వహిస్తున్న భారత అణు విద్యుత్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి