గుజరాత్ గవర్నర్‌ను తొలగించాలి: అద్వానీ డిమాండ్

మంగళవారం, 30 ఆగస్టు 2011 (15:03 IST)
గుజరాత్ లోకాయుక్త నియామకం విషయంలో అధికార భారతీయ జనతా పార్టీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ఆరంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిని మాటమాత్రం సంప్రందించకుండా లోకాయుక్తను రాష్ట్ర గవర్నర్ నియమించడాన్ని భాజపా అగ్రనేత ఎల్కే.అద్వానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకాయుక్త నియామకం విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిన గవర్నర్‌ను తక్షణం రీకాల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశంపై అద్వానీ నేతృత్వంలోని భాజపా ఎంపీలు మంగళవారం పార్లమెంట్ హౌస్ ఎదుట ధర్నా చేశారు.

ఇదే అంశంపై వచ్చే నెల ఒకటి లేదా రెండు తేదీల్లో రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌తో భేటీ కానున్నట్టు చెప్పారు. లోకాయుక్త నియామకంలో నిబంధనలకు గవర్నర్ తిలోదకాలు ఇచ్చారని మండిపడ్డారు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా మంత్రివర్గం అభిప్రాయాన్ని ఏమాత్రం తెలుసుకోకుండా ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

అనంతరం గుజరాత్ రాష్ట్ర గవర్నర్‌కు వ్యతిరేకంగా భాజపా ఎంపీలు నినాదాలు చేశారు. గుజరాత్‌పై ద్వంద్వం వైఖరిని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. తక్షణం గవర్నర్‌ను రీకాల్ చేయాలని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఆరోపించారు. గుజరాత్ రాజ్‌పాల్ భవన్ కాంగ్రెస్ భవన్‌గా మారిదంటూ వారు ఆరోపించారు. గుజరాత్ లోకాయుక్తగా ఆర్ఏ.మెహతాను గవర్నర్ కమ్లా బేనీవాల్ ఇటీవల నియమించిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి