గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మళ్లీ మొట్టికాయ!
శనివారం, 25 ఫిబ్రవరి 2012 (10:08 IST)
File
FILE
గుజరాత్ ప్రభుత్వానికి శుక్రవారం సుప్రీంకోర్టు మరోసారి మొట్టికాయ వేసింది. 2002-06 మధ్య కాలంలో రాష్ట్రంలో జరిగిన 22 ఎన్కౌంటర్ మరణాలపై ఏర్పాటైన దర్యాప్తు సంస్థకు అధిపతిని నియమించే విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పర్యవేక్షణ సంస్థ ఛైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎంబిషా స్థానంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఆర్ వయస్ నియాకంలో తమను ఎందుకు సంప్రదించలేదని కోర్టు ప్రశ్నించింది.
కొత్త ఛైర్మన్ నియామక ప్రతిపాదన గురించి తమకు చెప్పకపోవడాన్ని జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజాన్ ప్రకాశ్ దేశాయ్తో కూడిన ధర్మాసనం తప్పుపట్టింది. ఎన్కౌంటర్లపై సీనియర్ జర్నలిస్టు బీజీ వర్గీస్, గేయ రచయిత జావేద్ అఖ్తర్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఎవరు ఛైర్మన్గా ఉండాలనే విషయంలో ప్రాథమిక సూత్రాలను మార్చకూడదని స్పష్టం చేసింది.
ఛైర్మన్గా కొనసాగేందుకు జస్టిస్ షా నిరాకరించడంతో అతని స్థానంలో జస్టిస్ వయస్ను నియమిస్తూ రాష్ట్రా ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని గుజరాత్ అదనపు అడ్వకేట్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకవచ్చారు.