జగన్‌లో నాయకత్వ లక్షణాలు పుష్కలం: రాహుల్

గురువారం, 10 సెప్టెంబరు 2009 (15:58 IST)
File
FILE
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుడు వైఎస్.జగన్‌ మోహన్ రెడ్డిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. తమిళనాడు రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటన చేస్తున్న ఆయన గురువారం చెన్నయ్‌లో మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన వైఎస్‌ జగన్మోహన్ రెడ్డిపై మీడియా అడిగిన ప్రశ్నలకు రాహుల్ ముక్కుసూటిగా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ రాజకీయంగా గుర్తించుకోతగిన విజయాలు ఇప్పటికే సాధించారని గుర్తు చేశారు. కేవలం ప్రముఖ రాజకీయ నాయకుని కుమారునిగానే కాకుండా, జగన్‌కు ప్రజల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ వారసుడు ఎవరనే విషయాన్ని నిర్ణయించాల్సింది కాంగ్రెస్ అధిష్టానమేనని స్పష్టం చేశారు. ఢిల్లీలోని అధిష్టానం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీదే భావి ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకునే బాధ్యతని ఆయన అన్నారు. తాను యువజన కాంగ్రెస్‌ను మరింత పటిష్టం చేసేందుకే ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు.

యువకులకు నాయకత్వ బాధ్యతలు, సరైన అవకాశాలు లభించేలా చూడటం తద్వారా దేశంలో యువజన కాంగ్రెస్ మరింత చురుగ్గా పనిచేసేలా కృషి చేయడం తన బాధ్యత రాహుల్ స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి