జమ్మూ ఘర్షణలు : కేంద్ర బృందం పరిశీలన

మంగళవారం, 5 ఆగస్టు 2008 (16:52 IST)
అమరనాథ్‌కు కేటాయింటిన భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకున్న నేపథ్యంలో జమ్మూలో చెలరేగిన ఘర్షణలు మంగళవారం కూడా కొనసాగుతున్నాయి. దీంతో అక్కడి పరిస్థితి సమీక్షించేందుకు ఇద్దరు అధికారులతో కూడిన కేంద్ర బృందం శ్రీనగర్‌లో పర్యటిస్తోంది.

అమరనాథ్ దేవాలయానికి కేటాయించిన భూములను ప్రభుత్వం తిరిగి తీసుకోవడంతో హిందూ సంస్థలు కొన్ని జమ్మూలో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల ప్రభావంతో సోమవారం పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల కారణంగా పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందాడు.

దీంతో కోపానికి గురైన ప్రజలు పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ కారణంగా జమ్మూలో కర్ఫ్యూ కొనసాగుతోంది. దీనివల్ల అక్కడ పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. ఈ విధంగా జమ్మూలో పరిస్థితి రోజు రోజుకు తీవ్రమవుతున్న తరుణంలో బుధవారం ఈ విషయంపై అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలంటూ ప్రధాని మన్మోహన్ అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పలికారు.

వెబ్దునియా పై చదవండి