జీ-8 సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మన్మోహన్

మంగళవారం, 7 జులై 2009 (11:24 IST)
FileFILE
ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం మధ్యాహ్నం ఇటలీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇటలీలోని లాఅక్విలాలో జరిగే జీ-8 సదస్సులో ఆయన పాల్గొంటారు. మొత్తం ఐదు రోజుల పాటు సాగే ఈ విదేశీ పర్యటనలో ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే, చైనా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా, తదితర ప్రపంచ దేశాల నేతలతో భేటీ అవుతారు.

జీ-8 సదస్సులో ప్రధాని పర్యావరణ మార్పులు, ఇంధనం, ఆహార భద్రత తదితర అంశాలపై చర్చించనున్నారు. జీ-8 సదస్సుకు ముందు ఆయన జీ-5 గ్రూపు దేశాల నేతలతో సమావేశమవుతారు. ఈ గ్రూపులో చైనా, ఇండియా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా దేశాలు ఉన్నాయి. కాగా, గత 2003 సంవత్సరం తర్వాత ప్రధాని జీ-8 సదస్సుకు హాజరుకావడం ఇది ఐదోసారి.

ప్రధాని ఇటలీ పర్యటనపై విదేశాంగ కార్యదర్శి శివశంకర్ మీనన్ మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ కరెన్సీగా చెలామణి అవుతున్న డాలర్‌‍కు ప్రత్యామ్నాయాలను కనుగొనే ప్రతిపాదనలపై చర్చించేందుకు భారత్ సుముఖంగా ఉందన్నారు. అంతేకాకుండా, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు చేపట్టాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి