జీ20 సమావేశాల కోసం సియోల్ బయలుదేరిన మన్మోహన్

దక్షిణ కొరియాలో జరగనున్న జీ-20 దేశాల ఆర్థిక సహకార సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బుధవారం సియోల్‌కు పయనమయ్యారు. ఈ సమావేశాలలో జీ-20 దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చర్చిస్తారు. ఈ సమావేశాల్లో భాగంగా మూడు రోజుల పాటు సియోల్‌లో ప్రధాని పర్యటిస్తారు.

ఈ సమావేశాల్లో రెండు సమస్యలకు ఇప్పటికే ఒబామా పర్యటన పుణ్యమా అని పటిష్టమైన మద్దతు లభించింది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ)లో భారతదేశ శాస్వత సభ్యత్వం, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్)లో అధిక ఓటింగ్ హక్కు వంటి అంశాలకు అమెరికా గట్టి మద్దుతునిచ్చింది.

యాదృచ్చికంగా.. సియోల్‌లో కూడా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ప్రధాని కలవనున్నారు. గత జనవరిలో పదవి చేపట్టినప్పటీ నుంచి మన్మోహన్ సింగ్ అమెరికా అధ్యక్షుడిని కలవడం ఇది ఏడవసారి. అంతే కాదు.. ఒక్క వారంలో రెండవసారి ఒబామాను సింగ్ కలవనున్నారు.

జీ-20 సమావేశంలో భాగంగా మన్మోహన్ సింగ్ దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ మ్యుంగ్ బాక్‌తో కూడా సమావేశం కానున్నట్లు అధికారులు తెలిపారు. గత అక్టోబర్‌ 29న హనోయ్‌లో జరిగిన ఆసియాన్ సమావేశంలో కూడా ఈ ఇరు దేశాల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పౌర అణు ఒప్పందం, ఆర్థిక సహకార ఒప్పందాల గురించి వారు ఓ నిర్ణయానికి వచ్చారు.

నవంబర్ 10న సియోల్ చేరుకున్న ప్రధాని జీ-20 సమావేశాలలో పాల్గొన్న అనంతరం నవంబర్ 11న నేతలతో అధికారిక విందులో పాల్గొంటారు. నవంబర్ 12న ప్రధాని మన్మోహన్ సింగ్ తిరిగి భారత్‌కు పయనవుతారు. ఈ జీ-20 సమావేశాల్లో భారత్‌, దక్షిణ కొరియాలతో పాటు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జెర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షణ ఆఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు కూడా పాల్గొంటున్నాయి.

వెబ్దునియా పై చదవండి