డీఎంకే అధ్యక్ష పదవికి పోటీ చేస్తా: మంత్రి అళగిరి

గురువారం, 1 ఏప్రియల్ 2010 (13:59 IST)
ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగితే తాను పోటీ చేస్తానని కేంద్ర రసాయన, ఎరువుల శాఖామంత్రి, ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే.అళగిరి ప్రకటించారు. దీంతో డీఎంకేలో అధినాయకత్వ పోరు తీవ్రరూపం దాల్చే అవకాశాలు లేకపోలేదు.

తన ఆస్ట్రేలియా పర్యటనను పూర్తి చేసుకుని గురువారం చెన్నయ్‌కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎంకే ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. అందువల్ల ఆ పార్టీ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరిగితే తాను పోటీలో ఉంటానని ఆయన తెలిపారు. పార్టీ అధ్యక్ష బాధ్యలను ప్రజాస్వామ్యబద్ధంగానే తాను చేపడుతానని చెప్పారు.

కాగా, డీఎంకే చీఫ్ కరుణానిధి హయాం అనంతరం ఆయన స్థానంలో మరో వ్యక్తిని ఊహించుకోలేమని అళగిరి గతంలో వ్యాఖ్యానించారు. దీనిపై ముఖ్యమంత్రి కరుణానిధి స్పందించారు. తన వారసుడిని పార్టీ అధిష్టానం ఎంపిక చేస్తుందని తాజాగా వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో.. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని చెన్నయ్‌కు వచ్చిన అళగిరి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పైవిధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, కరుణానిధి తన వారసునిగా చిన్న కుమారుడు, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌ను ప్రకటించాలని ఉవ్విళ్ళూరుతున్నారు.

వెబ్దునియా పై చదవండి