ఢిల్లీలో తెలంగాణ హీట్.. రోజంతా చర్చోపచర్చలు!

సోమవారం, 10 ఫిబ్రవరి 2014 (17:48 IST)
File
FILE
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు) 2013కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేయడంతో రాజధాని ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారి వేడెక్కి పోయాయి. ఈ బిల్లును ఎలాగైనా పాస్ చేయించాలన్న పట్టుదలతో అధికారపక్షమైన కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదునుపెడుతోంది.

ఇందులోభాగంగా అధికార, విపక్ష సభ్యులతో విడతలవారీగా చర్చలకు శ్రీకారం చుట్టారు. ఈ చర్చలు అధికార - ప్రతిపక్ష నేతల మధ్య రసవత్తరంగా సాగుతుండగా, సమైక్యాంధ్ర - తెలంగాణవాదుల మధ్య ఆందోళనలు మిన్నంటాయి.

సోమవారం ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పీసీసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, దిగ్విజయ్ సింగ్లు మంతనాలు జరిపారు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో దిగ్విజయ్ సింగ్ భేటీ అయ్యారు. ఉభయ సభల్లో విపక్ష బీజేపి నేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌ జైట్లీలతో ప్రధాని మన్మోహన్‌ సింగ్ సమావేశం నిర్వహించారు. అరుణ్ జైట్లీతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ చర్చించారు. రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీతో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, కమల్నాథ్, జైరామ్ రమేష్లు సమావేశమయ్యారు.

మరోవైపు.. రాష్ట్ర విభజన ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో సీమాంధ్ర, తెలంగాణవాదుల ఆందోళన ఉధృతమైంది. విభజనకు వ్యతిరేకంగా ఏపీభవన్‌ వద్ద ఆందోళన చేస్తున్న సీమాంధ్ర నేతలు, విద్యార్థులను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఫలితంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వెబ్దునియా పై చదవండి