తమిళనాడు డీజీపీగా లతికా చరణ్ నియామకం!

శనివారం, 9 జనవరి 2010 (13:18 IST)
తమిళనాడు రాష్ట్ర డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ)గా మహిళా ఐపీఎస్ అధికారి లతికా చరణ్ నియమితులయ్యారు. ఈ మేరకు, ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ విధులను నిర్వహిస్తున్న డీజీపీ కేపీ.జైన్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో లతికా చరణ్‌ను నియమించినట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

తమిళనాడు రాష్ట్రానికి డీజీపీగా బాధ్యతలు చేపట్టి తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా లతికా చరణ్ రికార్డు పుటలకెక్కారు. ప్రస్తుతం ఈమె తమిళనాడు పోలీసు ట్రైనిగ్ కళాశాల డీజీపీగా పని చేస్తున్నారు. ఈమె గతంలో చెన్నయ్ నగర పోలీసు కమిషనర్‌గా కూడా పని చేశారు.

చెన్నయ్ మహానగరానికి కమిషనర్‌గా నియమితులైన తొలి మహిళగా కూడా లతికకు రికార్డు ఉంది. ఈ నెల 13వ తేదీన ఆమె డీజీపీగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంఛల్‌ రాష్ట్ర డీజీపీగా కాంచన్ ఛౌదరి బాధ్యతలు నిర్వహిస్తుండగా, ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర డీజీపీగా లతికా చరణ్ నియమితులు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లా మూనారు ప్రాంతానికి చెందిన లతికా చరణ్ 1952 సంవత్సరంలో జన్మించారు. చెన్నయ్ క్రిస్టియన్ కళాశాలలో బీఎస్సీ గణితం విద్యను అభ్యసించిన ఆమె.. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ సైకాలజీని పూర్తి చేశారు. 1976 సంవత్సరంలో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.

ఆ తర్వాత వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన ఆమె.. చెన్నయ్ నగరానికి 90 పోలీసు కమిషనర్‌గాను, తొలి మహిళా కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈమె సమయంలో ప్రముఖ రౌడీ వెల్లై రవిని ఎన్‌కౌంటర్‌లో నగర పోలీసులు హతమార్చారు.

వెబ్దునియా పై చదవండి