తెలంగాణపై 'నెల' మాట తప్పిన గులాం నబీ ఆజాద్!

బుధవారం, 5 జూన్ 2013 (09:44 IST)
File
FILE
కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ మళ్లీ మాట తప్పారు. తెలంగాణ అంశాన్ని నెల రోజుల్లో పరిష్కరిస్తామంటూ మూడు రోజుల క్రితం చేసిన ప్రకటనపై ఆయన మళ్లీ వెనక్కి తగ్గారు. తెలంగాణ అంశం పరిష్కారానికి ఏకాభిప్రాయం లేదని, ఈ అంశంపై సీమాంధ్ర ప్రాంత నేతలతో సంప్రదింపులు జరపాల్సి ఉందంటూ ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాతే తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు.

ఆయన ఢిల్లీలో ఒక తెలుగు చానెల్‌తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోమని కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ చెప్పలేదన్నారు. అయితే, తెలంగాణపై తుది నిర్ణయం రావాలంటే ముందు చర్చలు ముగియాల్సి ఉందని, ఇందుకు సమయం పడుతుందని చెప్పారు. తెలంగాణ చిన్న విషయం ఏమీ కాదని.. పైగా రాష్ట్ర విభజనకు ఆంధ్రప్రదేశ్‌లో ఏకాభిప్రాయం కూడా లేదన్నారు.

అందుకే నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందన్నారు. తాము తెలంగాణ ఇవ్వబోమని ఎన్నడూ చెప్పలేదని, ఈ అంశానికి ఇంకా ముగింపు పలకలేదని గుర్తుచేశారు. తెలంగాణ అంశం ముగిసిందని మేమెప్పుడూ చెప్పలేదు. కాబట్టి, ఆ అంశం సజీవంగానే ఉందన్నారు.

టీ ఎంపీలు వెళ్లిపోవడానికి పలు కారణాలు చెబుతున్నారు. వాటిని నేను మళ్లీ చెప్పదలచుకోలేదు. కానీ, వారికి నిజంగా తెలంగాణ పట్ల ఆసక్తి ఉంటే పార్టీలోనే ఉండి పోరాడేవాళ్లని ఆజాద్ ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి