త్వరలో స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్‌లు

FILE
దేశంలో స్వైన్ ఫ్లూ మహమ్మారిని అంతమొందించేందుకు తగిన వ్యాక్సిన్‌‌ను కనుగొనేందుకు వైద్యాధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ మహమ్మారి వ్యాధిని అరికట్టేందుకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందని, రక్షణ, రోగ నిరోధక శక్తి వ్యాక్సిన్‌ కనుగొనేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసిఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ విశ్వ మోహన్‌ కటోచ్‌ తెలిపారు.

దేశీయ మందుల కంపెనీలు భారత్‌ బయోటెక్‌, పనాకా బయోటెక్‌, సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలు వ్యాక్సిన్‌ను తయారుచేసే పనిలో ఉన్నాయని, ఈ ఏడాది చివరినాటికి తొలుత జంతువులపై ప్రయోగాలు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.

మలివిడతలో మనుషులపై రెండు దశల్లో వీటిని పరీక్షించనున్నామని ఆయన చెప్పారు. వ్యాక్సిన్‌ తయారీకిగాను వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే మార్చి నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని, లేకుంటే వచ్చే ఏడాది చివరకుగానీ ఇది సాధ్యం కాదని ఆయన అన్నారు.

డ్రగ్స్‌ అండ్‌ వ్యాక్సిన్స్‌ కమిటీ, హెచ్‌1ఎన్‌1 వైరస్‌ ప్రత్యేక కమిటీ పరీక్షల అనంతరం వచ్చే రెండు, మూడు వారాల్లో ఈ పరీక్షల విధానాన్ని ఖరారు చేస్తామన్నారు.

వెబ్దునియా పై చదవండి