దావూద్‌తో నేపాల్ యువరాజుకి సంబంధాలు

నేపాల్ మాజీ యువరాజు పారస్‌కు భారత మోస్ట్‌వాంటెడ్ తీవ్రవాదితో సంబంధాలు ఉన్నట్లు మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన నేపాలీ పౌరులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ తీవ్రవాద నిరోధక దళం ఇటీవల నకిలీ నోట్ల ముఠా గట్టురట్టు చేసింది. ఈ ముఠాలోని నేపాల్ పౌరులను పోలీసులు విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

నేపాల్ రాజ కుటుంబానికి మోస్ట్‌వాంటెడ్ తీవ్రవాది దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని నేపాల్ పౌరులు పోలీసులతో చెప్పారు. నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర కుమారుడైన పారస్ ప్రస్తుతం సింగపూర్‌లో ఆశ్రయం పొందుతున్నారు. భారత్‌లోకి నకిలీ కరెన్సీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడిన ఇద్దరు నేపాల్ పౌరులు నేపాల్ రాజ కుటుంబం- దావూద్ సంబంధాలు బయటపెట్టారు.

పారస్, దావూద్ ఇబ్రహీం మధ్య నేపాల్‌కు చెందిన ఓ ప్రముఖ మంత్రి కుమారుడు యూనస్ అన్సారీ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. వీరి ద్వారా భారత్‌లోకి కోట్లాది రూపాయాల నకిలీ కరెన్సీ నోట్లు వస్తున్నాయి.

దావూద్ ఇబ్రహీం నకిలీ భారత కరెన్సీని తయారు చేస్తుండగా, పారస్ ఈ నకిలీ నోట్లను ఇతర దేశాల నుంచి నేపాల్‌లోకి వచ్చేటట్లు చేస్తున్నాడు. ఆ తరువాత ఈ నకిలీ నోట్లు నేపాల్ నుంచి భారత్‌లోకి వస్తున్నాయి. భారత్- నేపాల్ సరిహద్దులకు ఈ నకిలీ కరెన్సీని చేర్చేందుకు పారస్ తన ప్రాబవాన్ని ఉపయోగిస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి