దేశంలోని ప్రతి ప్రాంతం.. భారతీయులందరిదీ: రాహుల్

మంగళవారం, 2 ఫిబ్రవరి 2010 (16:05 IST)
సువిశాల దేశంలోని ప్రతి ప్రాంతం ప్రతి ఒక్క భారతీయునికి సొంతమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గత 2008 సంవత్సరంలో ముంబైపై జరిగిన దాడుల్లో మహారాష్ట్ర వారితో పాటు ఎన్ఎస్‌జి కమెండోలు ప్రాణాలు కోల్పోయారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.

అలాగే, తనపై శివసేన నేతలు బాల్‌థాక్రే, ఉద్ధవ్‌థాక్రేలతోపాటు.. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాక్రే చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. వారి వాదనతో తనకు సంబంధం లేదు. ఈ దేశంలోని ప్రతి ప్రాంతం ప్రతి భారతీయునికి సొంతం. అలాగే ముంబై కూడా అని స్పష్టం చేశారు.

దీనిపై ఆయన మంగళవారం పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశం భారతీయులందరి సొంతమన్నారు. 2008 నవంబరు 26వ తేదీన ముంబైపై ఉగ్రవాదుల దాడులలో మహారాష్ట్ర వారితో సహా ఎన్ఎస్‌జి కమాండోలు చేసిన త్యాగాన్ని ఆయన శ్లాఘించారు.

తీవ్రవాదుల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన వారిలో ఎన్ఎస్‌జి కమెండోలలో బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర ఇలా అన్ని ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరి సహకారంతో ఈ దేశం ముందుకు సాగాల్సి ఉంటుంది. అందరూ దేశాన్ని ముందుకు నడిపించవలసి ఉంది అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

ముంబై దాడుల్లో వీరమరణం చెందిన వారిలో యూపీ, బీహార్ వాసులనే గుర్తించి, మహారాష్ట్రకు చెందిన పోలీసు అమర వీరుల త్యాగాలను రాహుల్ కించ పరిచారని శివసేన ఆరోపించడాన్ని ఆయన తప్పుబట్టారు. భారతదేశం భారతీయులది. భారతదేశంలో ప్రతి ప్రాంతం ప్రతి ఒక్క భారతీయునికి సొంతం. బాల్‌థాక్రే లేదా రాజ్ థాక్రే అభిప్రాయాలపై నాకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ దేశ పౌరులుగా దేశంలోని ఎక్కడికైనా హక్కు ఉందని రాహుల్ అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి