దేశానికి బలహీన ప్రధాని ఉండటం ప్రమాదం : హజారే

శుక్రవారం, 9 డిశెంబరు 2011 (16:18 IST)
దేశానికి బలహీనమైన వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండటం అత్యంత ప్రమాదకరమని ప్రముఖ గాంధేయవాది, అవినీతి వ్యతిరేక ఉద్యమకర్త అన్నా హజారే అభిప్రాయపడ్డారు. దేశంలో పెరిగిపోతున్న అవినీతి నిర్మూలన కోసం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రూపొందించి నివేదికను శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నివేదికపై హజారే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై మాటలయుద్ధానికి దిగారు. బలహీన నేత దేశ ప్రధానమంత్రిగా కొనసాగడం ప్రమాదకరమన్నారు. అలాగే లోక్పాల్ బిల్లుపై కేంద్ర మంత్రులు చిదంబరం, కపిల్ సిబాల్‌లు గందరగోళం సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు.

అదేవిధంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీపైనా విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీపై రాహుల్ తీవ్రమైన ఒత్తిడి చేశారన్నారు. ఫలితంగా లోక్పాల్ నివేదికను స్టాండింగ్ కమిటీ బలహీనంగా తయారు చేసిందన్నారు. అనారోగ్యాన్ని సాకుగా చూపి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జోక్యం చేసుకోవడం లేదన్నారు. అందుకే వచ్చే యేడాది ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ.. అవినీతి నిర్మూలన వ్యతిరేక పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి