నా భార్య ప్రియుడితో లేచిపోయింది.. అందుకే ఆత్మహత్య...

గురువారం, 10 అక్టోబరు 2013 (19:11 IST)
File
FILE
అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్య... గతంలో ప్రేమించిన వ్యక్తితో లేచిపోవడాన్ని జీర్ణించుకోలేక ఓ సున్నిత మనస్కుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు ఆ వివరాలు ఇలా ఉన్నాయి.....

సెంట్రల్ ముంబైలోని అగ్రిపడా ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల సునీల్ అగ్డీ అనే డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తాను ఆత్మహత్య చేసుకునే ముందు ఒక తన మాటలను, ఆవేదనను, తనకు జరిగిన అన్యాయాన్ని వీడియో రూపంలో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తన ఆత్మహత్యకు భార్య అనురాధ, ఆమె ప్రియుడు అబ్దుల్ వహబ్ అలియాస్ ఛోటూ కారణమని అందులో పేర్కొన్నాడు. ప్రియుడితో వెళ్ళిపోయిన తన భార్యను తనకు అప్పగించాలని అగ్రిపడా ఎస్.ఐ అజిత్ కదంను అనేక మార్లు కోరినప్పటికీ.. ఫలితం లేకుండా పోయిందని ఆరోపించాడు.

పైపెచ్చు.. సాయం చేయలేదు కదా.. తనను ఇతర పోలీసుల ముందు హేళన చేస్తూ మాట్లాడినట్టు వీడియోలో తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను తనువు చాలించడం మినహా మరో మార్గం కనిపించలేదని, తన చావుకు కారణం తన భార్య అనురాధ, ఆమె ప్రియుడు ఛోటూ అంటూ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ వీడియో చూసి అయినా న్యాయం చెప్పాలని కోరాడు. దీంతో, పోలీసులు.. ఆత్మహత్యకు పురిగొల్పడం, నేరానికి పాల్పడడం వంటి సెక్షన్ల కింద అనురాధ, ఆమె ప్రియుడిపై కేసులు నమోదు చేశారు. ఛోటూతో అనురాధ ఏడేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తోందని ఛోటూ భార్య హీరా అంగీకరించింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి