నేటి నుంచి 2జి స్పెక్ట్రమ్ కేసులో విచారణ ప్రారంభం!

వేసవి సెలవుల విరామం అనంతరం 2జీ స్పెక్ట్రమ్ కేసు విచారణ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ సెలవుల కారణంగా అన్ని జిల్లా కోర్టులు మూతపడ్డాయి. ఈ కోర్టులు సోమవారం నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. దీంతో వేసవి విరామం కారణంగా నిలిపివేసిన 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణం విచారణ కూడా తిరిగి ప్రారంభం కానుంది.

ఈ కేసులో ప్రధాన నిందితులైన టెలికామ్‌ శాఖ మాజీ మంత్రి ఏ.రాజా, డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళి, స్వాన్‌ టెలికామ్‌ ప్రమోటర్‌ షహీద్‌ ఉస్మాన్‌ బల్వా, మరో 11 మంది నిందితులు ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఓపీ షైనీ ముందు హాజరవుతారు.

సుప్రీం కోర్టు ఆదేశాలను పురస్కరించుకొని షైనీ కోర్టు ప్రత్యేకంగా ఈ కేసును విచారిస్తున్న విషయం విదితమే. కోర్టు ఈ కేసులో చివరిసారిగా జూన్‌ 10వ తేదీన విచారణ నిర్వహించింది. ఇప్పటి వరకు డాక్యుమెంట్ల పరిశీలన జరిగింది. ఇకమీదట కోర్టు ప్రాసిక్యూషన్‌, డిఫెన్స్‌ న్యాయవాదుల వాదనలను ప్రత్యేక కోర్టు ఆలకించనుంది.

వెబ్దునియా పై చదవండి