పేదల అభ్యున్నతికి మాయావతి వ్యతిరేకం: కాంగ్రెస్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి అడ్డుతగులుతున్నారని కాంగ్రెస్ ఆ పార్టీ ఆరోపించింది. ముఖ్యంగా.. బుందేల్‌ఖండ్ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఒక స్వతంత్ర సంస్థ ఏర్పాటును ఆమె వ్యతిరేకించండాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలోని కొన్ని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేసే ఈ అథారిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నందుకు మాయావతిని ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మీడియా విభాగం హెడ్ వివేక్ సింగ్ తప్పుపట్టారు. దీనిపై ఆయన శనివారం మాట్లాడుతూ.. ఆ ప్రాంతంలోని పేద, అణగారిన వర్గాల ప్రజల ఆర్థిక పురోగతికి దోహదం చేసే ఇటువంటి పథకానికి ఒక దళిత ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారో తమకు అర్థం కావడం లేదన్నారు.

తమ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ బుందేల్‌ఖండ్‌ ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి ప్రజలు జీవన స్థితిగతులను, కష్టనష్టాలను స్వయంగా తెలుసుకున్నారన్నారు. అందుకే ఆయన ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలని ప్రధానికి కూడా విజ్ఞప్తి చేశారని బుందేల్‌ఖండ్ ఎమ్మెల్యే అయిన వివేక్ సింగ్ గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి