భారత్-అమెరికాల మధ్య కీలక వ్యూహాత్మక భాగస్వామ్యం!!

భారత్ అమెరికాల మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ అభిప్రాయపడ్డారు. వచ్చే నవంబరు భారత్‌ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రానున్నారని, ఆ సమయంలో ఈ ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేస్తారని చెప్పారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ భారత్, అమెరికా ప్రభుత్వాల అవిరామ కృషి వల్ల ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలు బలంగా ఉన్నాయన్నారు. ఇరు దేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందానికి సంబంధించిన అణు ప్రమాద పరిహార బిల్లులో ఎలాంటి ప్రతికూల అంశాలూ లేవన్నారు. ఒబామా పర్యటనకు ముందే ఈ ఒప్పందం అమలుకు అవసరమైన అన్ని చర్యలూ పూర్తవుతాయని ఆశిస్తున్నట్టు శివశంకర్ మీనన్ వెల్లడించారు.

ఇదిలావుండగా, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన భారత పర్యటనకు అవసరమైన సన్నాహాలను ముమ్మరం చేశారు. నవంబర్‌లో జరిగే ఈ చారిత్రక పర్యటన ఇరు దేశాల స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని దక్షిణాసియా వ్యహారాలు చూస్తున్న అమెరికా విదేశాంగ సహాయ మంత్రి రాబర్ల్‌బ్లేక్ అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి