మద్రాసు హైకోర్టు ఘర్షణ: విచారణ కమిటీ ఏర్పాటు

మద్రాసు హైకోర్టులో పోలీసులకు, లాయర్లకు మధ్య ఏర్పడిన ఘర్షణపై విచారించేందుకు సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ ఆదేశాల మేరకు ఈ కమిటీ ఏర్పడింది.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో నియమించనున్న ఈ కమిటీ 15రోజుల్లో తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించనుంది.

ఈ సందర్భంగా మద్రాసు హైకోర్టులో ఘర్షణకు కారణమైన చెన్నై జాయింట్ కమిషనర్‌తో సహా ముగ్గురు డిప్యుటీ కమిషనర్లను బదిలీ చేయాలని బాలకృష్ణన్ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు. అలాగే ఘర్షణ సందర్భంగా కోర్టు ఆవరణలో ధ్వంసమైన లాయర్ల వాహనాల మరమ్మతు ఖర్చులను ప్రభుత్వమే భరించే అంశాన్ని ఆలోచించాలని కోర్టు పేర్కొంది.

దీంతోపాటు పోలీసు ఘర్షణలో గాయపడిన లాయర్ల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వీటితోపాటు హైకోర్టు ఆవరణలో ఉన్న పోలీసుస్టేషన్‌ను ఎత్తివేయాలని కూడా కోర్టు పేర్కొంది. లాయర్లు సైతం తమ ఆందోళన విరమించి విధులకు హాజరుకావాలని సుప్రీంకోర్టు కోరింది.

వెబ్దునియా పై చదవండి