మహిళా బిల్లుపై ప్రతిపక్ష నేతలతో చర్చించనున్న ప్రణబ్‌

సోమవారం, 5 ఏప్రియల్ 2010 (09:48 IST)
లోక్‌సభ రెండోవిడత బడ్జెట్‌ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగానే కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా జాతీయ, ప్రాంతీయ ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ప్రతిపక్ష నాయకులతో కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్‌ ముఖర్జీ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు.

సోమవారం ఉదయం పదకొండున్నర గంటలకు లోక్‌సభలో జరిగే ఈ సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని ఇప్పటికే ముఖ్యులందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ బిల్లు(108వ సవరణ)కు సంబంధించి ప్రభుత్వ వైఖరిని ప్రణబ్‌ అన్ని పార్టీల నేతలకూ వివరించి రాజ్యసభ ఆమోదించిన రూపంలో లోక్‌సభలోనూ బిల్లు ఆమోదానికి సహకరించాల్సిందిగా కోరనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

బిల్లు విషయంలో ఏ పార్టీకైనా తీవ్ర అభ్యంతరాలు ఉన్నట్టయితే వాటిని తెలుసుకుని ఇప్పుడే తొలగించడానికి సాధ్యమైన మేరకు ప్రయత్నించేందుకు తమ యూపీఏ ప్రభుత్వం భావిస్తోందని తెలియజెప్పడానికి ఇదో అవకాశమని యూపీఏ వర్గాలు తెలిపాయి. ఏదేమైనప్పటికీ లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింప జేసుకునేందుకు యూపీఏ భారీగానే కసరత్తు చేస్తోందనడంలో సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి