ముంబై దాడులు: తీవ్రవాది కసబ్ ఉరిశిక్షపై సుప్రీం స్టే

సోమవారం, 10 అక్టోబరు 2011 (17:14 IST)
ముంబై మారణహోమానికి పాల్పడిన పదిమంది ముష్కరుల్లో ప్రాణాలతో పట్టుబడి ఉరిశిక్ష పడిన పాకిస్థాన్ తీవ్రవాది అజ్మల్ కసబ్‌కు విధించిన ఉరిశిక్షపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. మరణశిక్ష అమలుపై స్టే విధించాలని కసబ్ దాఖలు చేసుకున్న పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. ఈ పిటీషన్‌పై తదుపరి విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా అపెక్స్ కోర్టు నోటీసులు జారీచేసింది.

26/11 దాడుల్లో పాక్ తీవ్రవాది అజ్మల్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించగా, దీన్ని బాంబే హైకోర్టు సమర్థించింది. ఈ శిక్షను అమలు చేయాలని కోడూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, తనకు ప్రాణభిక్ష పెట్టాలని కసబ్ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటీషన్‌ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది.

ఈ నేపథ్యంలో ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో కసబ్ తరపు న్యాయవాది పిటీషన్ దాఖలు చేయగా, దీన్ని సోమవారం విచారణకు స్వీకరించి, ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వెబ్దునియా పై చదవండి