ముంబై ప్రకంపనలు: పరివార్ నేతల మధ్య విభేదాలు!

మంగళవారం, 2 ఫిబ్రవరి 2010 (09:39 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబై భారతీయులందరిదీ అనే అంశంపై సంఘ్ పరివార్ సంస్థల మధ్య విభేదాలు పొడచూపాయి. మహారాష్ట్రలో ప్రధాన ప్రాంతీయ పార్టీగా ఉన్న శివసేన ముంబై కేవలం మరాఠీయులకే సొంతమని వాదిస్తోంది. అయితే, ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ మాత్రం శివసేన వాదనతో విభేదించింది. అలాగే, ఆర్ఎస్ఎస్ కూడా శివసేన నేతన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. దీంతో ఆర్ఎస్ఎస్, భాజపా, శివసేన పార్టీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి.

ఈ అంశంపై శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాక్రే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో తమ పార్టీ ఒక విధానంగా అనుసరిస్తున్న మరాఠీ మనుస్మృతికి దూరంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ నేతలను హెచ్చరించారు. భాషా ప్రాతిపదికన విభేదాలు రెచ్చగొట్టడం తగదని ఆర్‌ఎస్‌ఎస్‌ అధికార ప్రతినిధి మాధవ్‌ ఆదివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఉత్తరాది భారతీయులు లక్ష్యంగా శివసేన చేసే దాడులను నిరోధించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ పిలుపునిచ్చారు. శివసేన కార్యకర్తలు చేసే దాడుల నుంచి ఉత్తర భారతీయులకు రక్షణ కల్పిస్తామని భగవత్ ప్రకటించారు. దీన్ని ఉద్ధవ్ థాక్రే జీర్ణించుకోలేక పోయారు.

1992-93 సంవత్సరాల్లో జరిగిన మత కలహాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎక్కడుకు పోయిందని ప్రశ్నించారు. ఆనాడు రాష్ట్రంలోని హిందువులకు తామే అండగా నిలిచామన్నారు. దక్షిణ భారతంలో ఉత్తరాదివారు ఎలాంటి జీవనం గడిపేదీ ఒకసారి ఆర్‌ఎస్‌ఎస్‌ పరిశీలించాలని ఆయన హితవు పలికారు.

వెబ్దునియా పై చదవండి