యడ్యూరప్ప గద్దెదిగడం ఖాయం: కుమారస్వామి జోస్యం

ఈనెల 11వ తేదీన కర్ణాటక విధానసభలో జరుగనున్న బలపరీక్షలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సర్కారు కూలిపోవడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి జోస్యం చెప్పారు. తిరుగుబాటు చేసిన భాజపా ఎమ్మెల్యేలు గోవా నుంచి చెన్నయ్‌కు మకాం మార్చారు.

ఈ అంశంపై కుమారస్వామి చెన్నయ్‌లో మీడియాతో మాట్లాడుతూ భాజపా అసమ్మతి సభ్యులతో పాటు తామంతా ఐకమత్యంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం కర్ణాటక రాజకీయ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. అవినీతిమయంలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని మార్చేందుకే తమ ప్రయత్నమన్నారు.

గోవా నుంచి చెన్నయ్‌కు మకాం మార్చిన 11 మంది భాజపా అసమ్మతి ఎమ్మెల్యేలతో కలిసి ఆయన శనివారం రాత్రి చెన్నయ్‌కు చేరుకున్నారు. కాగా, యడ్యూరప్ప మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన మత్య్యుశాఖామంత్రి ఆనంద్ అస్నోతికర్ మాట్లాడుతూ అసమ్మతి ఎమ్మెల్యేలమంతా ఐక్యంగా ఉన్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి యడ్యూరప్పకు వ్యతిరేకంగా తాము ఆందోళన చేపట్టామని, దీన్ని సహించలేని భాజపా కార్యకర్తలు తమ వాహనాలపై దాడులు చేస్తున్నట్టు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి