రాజా-కనిమొళిలకు బెయిల్ ఇవ్వాలి : జశ్వంత్ సింగ్

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా భావిస్తున్న 2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌లో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ మంత్రి ఏ.రాజా, రాజ్యసభ సభ్యురాలు కనిమొళిలతో సహా ఇతరులకు బెయిల్ మంజూరు చేయాలని అభిప్రాయపడ్డారు.

గత ఎన్డీయే ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జశ్వంత్ సింగ్ మాట్లాడుతూ.. ఒకరిపై దోపిడీ, హత్య వంటి తీవ్రమైన నేరారోపణలు నమోదుకాని పక్షంలో ఆ కేసుల విచారణ జరుగుతున్నప్పుడు, ఇందులో అరెస్టు చేసిన వారు కటకటాల వెనుక ఎందుకు ఉండాలని ఆయన ప్రశ్నించారు. ఒక కేసులో అరెస్టు అయిన వ్యక్తి బెయిల్ పొందడం అతని హక్కు అని అన్నారు. లేనిపక్షంలో అతనిపై వచ్చిన అభియోగాలు నమోదు చేయడం వీలుకాదన్నారు.

అయితే, ఇవన్నీ తన వ్యక్తిగత అభిప్రాయాలన్నారు. అలాగే, ఒక నిందితుడిని శాశ్వతంగా జైలులో ఉండటానికి కూడా భాజపా సమ్మతించదని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఇపుడు తాను పార్టీ తరపున మాట్లాడటం లేదని వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నట్టు చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి