రాహుల్ పర్యటనపై డీఎంకే క్యాడర్ అసంతృప్తి

గురువారం, 10 సెప్టెంబరు 2009 (20:04 IST)
కాంగ్రెస్ యువరాజు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ తమిళనాడు రాష్ట్ర పర్యటనపై అధికార డీఎంకే క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. గతంలో రాష్ట్ర పర్యటనకు రాహుల్ మూడు సార్లు వచ్చినప్పటికీ.. డీఎంకే చీఫ్‌తో ఒక్కసారి కూడా భేటీ కాలేదు. తాజాగా, మూడు రోజుల పాటు రాష్ట్ర పర్యటనలో ఉన్న రాహుల్ ఈ దఫా కూడా కరుణతో భేటీ అయ్యేందుకు ఆసక్తి చూపలేదు.

ఢిల్లీకి చెందిన ఏ రాజకీయ నేత అయినా చెన్నయ్‌కు వస్తే కరుణతో భేటీ కాకుండా తిరిగి వెళ్లరు. అయితే, రాహుల్ మాత్రం ఈ ఆనవాయితీని ఏమాత్రం పట్టించుకోలేదు. దీనిపై డీఎంకే నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు ఒకింత అసంతృప్తి, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. డీఎంకే ఆవిర్భవించిన తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది.

ఈ పరిస్థితి గత 1967 సంవత్సరం నుంచి జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి తిరగి పూర్వవైభవం కల్పించేందుకు యువజన కాంగ్రెస్ రథసారథిగా రాహుల్ గాంధీ శాయశక్తులా కృషి చేస్తున్నారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా కృషి చేస్తే పార్టీకి తిరిగి పూర్వవైభవం తీసుకురావచ్చని రాహుల్ అభిప్రాయపడ్డారు.

అయితే ఈ పర్యటనలో కరుణానిధిని కలుసుకునేందుకు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరలేదు. దీనిపై డీఎంకే సీనియర్ నేత ఒకరు స్పందిస్తూ.. డీఎంకేను ఏ శక్తి విచ్ఛిన్నం చేయలేదు. తమ పార్టీకి కిందిస్థాయి నుంచి కార్యకర్తల అండదండలు పుష్కలంగా ఉన్నాయని గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి