లెహ్‌లో పర్యటించనున్న భారత ఆర్మీ చీఫ్

జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని లెహ్, లడక్ ప్రాంతాల్లో ఇటీవల చైనా మిలిటరీ సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడినట్లు వచ్చిన వార్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ సోమవారం స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే చైనా మిలిటరీ ఉల్లంఘనలపై తాజా కేంద్ర భద్రతా కమిటీ (సీసీఎస్) సమావేశంలో చర్చించారు.

సీసీఎస్ సమావేశంలో చైనా ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సెప్టెంబరు 10, 11 తేదీల్లో భారత ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ లెహ్‌లో పర్యటించనున్నారు. అక్కడ పరిస్థితులను తెలుసుకునేందుకు ఆర్మీ చీఫ్ ఈ పర్యటన చేపట్టారు.

దీనికిముందు ఎస్ఎం కృష్ణ మాట్లాడుతూ.. చైనాతో భారత్ అత్యంత శాంతియుతమైన సరిహద్దును పంచుకుంటుందన్నారు. తాజా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటామన్నారు. ఇతర దేశాలతో ఉన్న సరిహద్దులతో పోలిస్తే చైనాతో భారత సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయని ఎస్ఎం కృష్ణ విలేకరులతో చెప్పారు.

వెబ్దునియా పై చదవండి