'విశ్వాస పరీక్ష'లో వ్యతిరేక ఓటు: లెఫ్ట్

శనివారం, 5 జులై 2008 (10:56 IST)
అణు ఒప్పందంపై వామపక్ష పార్టీలు ఇప్పటికీ ఏమాత్రం మెట్టుదిగడం లేదు. ఆరునూరైనా తమ వైఖరికే కట్టుబడివుంటామని ఆ నేతలు కుండబద్ధలు కొట్టినట్టు చెపుతున్నారు. అంతేకాకుండా అణు ఒప్పందంపై పార్లమెంటులో ఓటింగ్ జరిగిన పక్షంలో యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని వారు తెల్చి చెప్పారు.

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ 'ఔట్‌లుక్' మ్యాగజైన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయం స్పష్టం చేశారు. అణు ఒప్పందంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగిన పక్షంలో వ్యతిరేకంగా ఓటు వేస్తామన్నారు. అయితే అణు ఒప్పందంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని తేటతెల్లం చేశాకే తాము ముందుకు సాగుతామన్నారు.

అలాగే సీపీఐ నేత ఏబి.బర్ధన్ మరో టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాజపాతో చేతులు కలిపే విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే ఐఏఈఏతో చర్చలు జరిపేందుకు ముందుకు వెళ్లిన పక్షంలో మద్దతు ఉపసంహరించుకోవడం ఖాయమని తేల్చి చెప్పారు.

ఇదిలావుండగా సీపీఎం జాతీయ స్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రచారంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని తాము ప్రజలను కోరనున్నట్టు కారత్ తెలిపారు. జాతి ప్రయోజనాలను ఫణంగా పెట్టిన కాంగ్రెస్ అణు ఒప్పందంపై ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ఈ అంశంతో పాటు.. నిత్యావసర సరుకుల ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదల అంశాలను కూడా కలుపుతామని కారత్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి