వీరప్పన్ అనుచరులకు ఉరిశిక్ష : రేపటితో సుప్రీంకోర్టు స్టే పూర్తి!

మంగళవారం, 19 ఫిబ్రవరి 2013 (09:45 IST)
File
FILE
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ముఠాకు చెందిన నలుగురు అనుచరులకు అమలు చేయాల్సిన ఉరిశిక్షపై సుప్రీంకోర్టు విధించిన తాత్కాలిక స్టే బుధవారంతో ముగియనుంది. తమ ఉరిశిక్షల అమలును నిలిపివేయాలంటూ ముద్దాయిల తరపున దాఖలు చేసిన పిటీషన్‌ను సోమవారం విచారణకు స్వీకరించిన అపెక్స్ కోర్టు.. ఉరిశిక్ష అమలుపై రెండు రోజుల పాటు తాత్కాలిక స్టే విధించింది. అదేసమయంలో దోషుల తరపున దాఖలైన పిటీషన్‌పై బుధవారం తుది విచారణ జరుపనుంది.

కర్ణాటక రాష్ట్రంలోని పాలార్ సమీపంలో 1993లో మందుపాతర పేల్చి 22 మంది పోలీసుల మరణానికి కారణమైన కేసులో వీరప్పన్ సోదరుడు జ్ఞానప్రకాశ్, అనుచరులు సైమన్, మీసేకార్ మాదయ్య, బిల్లవేంద్రన్‌లకు మైసూరులోని టాడా కోర్టు 2001లో జీవితఖైదు విధించగా, సుప్రీంకోర్టు దాన్ని ఉరిశిక్షగా మార్చింది. తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ వారు దాఖలు చేసుకున్న వినతిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా తిరస్కరించారు. దీంతో వారిని ఉరితీసేందుకు బెల్గాం జైలు అధికారులు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో ఉరి అమలును నిలిపివేయాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ముద్దాయిల తరపున కోర్టులో కోలిన్ గొన్జాల్వెజ్ వాదించారు. వారు దాఖలు చేసుకున్న పిటిషన్ చీఫ్ జస్టీస్ అల్తామస్ కబీర్, జస్టీస్ ఏఆర్ దవే, జస్టిస్ విక్రంజిత్ సేన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరగడం వల్ల వారి ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టుకు చెందిన మరో ధర్మాసనం తన తీర్పును వాయిదా వేసిందని గొన్జాల్వెజ్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి