శ్రీ అనంత పద్మనాభుని పుష్కరిణిలోనూ నిధులు!

తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ నిధులు అనంతంగానే వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు ఆలయంలోని నేలమాళిగల (రహస్య అరలు)లోనే నిధులు ఉన్నట్టు గుర్తించారు. అయితే, తాజాగా ఆలయానికి ముందున్న కోనేరు అడుగుభాగంలోనూ నిధులున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దక్షిణాదిలో ఉన్న వైష్ణవాలయాల్లో కేరళ రాజధాని తిరువనంతపురంలోని శ్రీపద్మనాభ ఆలయం ఒకటి. కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్త జనకోటితో నీరజనాలు అందుకుంటూ.. అత్యద్భుత శిల్పకళా సంపదతో కళాప్రియులను ఆకర్షిస్తున్నారు. ఈ ఆలయ నేలమాళిగల్లో దాగిన అమూల్య సంపదతో ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. గుడిలోని రహస్య అరల్లోనే కాకుండా ఆ దేవాలయం ఎదురుగా ఉన్న కోనేరు అడుగుభాగంలోనూ వెలకట్టలేనంత సంపద దాగి ఉన్న విషయాన్ని కనిపెట్టినట్టు సమాచారం.

మైసూర్ రాజా టిప్పు సుల్తాన్ బారి నుంచి, ఆ తర్వాత బ్రిటిష్ వారి నుంచి దేవాలయ నిధులను పరిరక్షించే ఉద్దేశంతో ఆలయ బాధ్యతలు చూస్తున్న ట్రావెన్‌కోర్ రాజులు కొంతభాగం నిధినిక్షేపాలను కోనేటి అడుగున దాచి ఉంచారని వార్తలు తాజాగా గుప్పుమన్నాయి. మరోవైపు, ఆ నిధులపై చెయ్యేస్తే.. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని, సముద్రం ముంచెత్తి సర్వనాశనం చేస్తుందని పలువురు వేద పండితులు హెచ్చరిస్తున్నారు.

ఆలయం, ఆలయం ఎదురున్న కోనేరుల అడుగుభాగంలో రహస్య మార్గాలున్నాయని, నిధులు దాచిన గదుల్లోకి అవి తెరుచుకున్నాయని, ఒకవేళ ఆ గదులను తెరిస్తే.. సముద్ర నీరు ఆ మార్గాల గుండా చొచ్చుకువచ్చి, ముంచేస్తుందని వివిధ ఆసక్తికర కథనాలు వినొస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి