సిమ్లాలో పూర్తిగా ధూమపాన నిషేధం: ప్రేమ్‌ కుమార్‌

ప్రసిధ్ద పర్యాటక ప్రాంతంగా బహుళ ప్రజాదరణ పొందిన "సిమ్లా" ఇక నుంచి ధూమపాన రహిత సిమ్లా (స్మోకింగ్ ఫ్రీ సిమ్లా)గా దర్శనివ్వనుంది. ఈ మేరకు ఆ ప్రాంతంలో ధూమపానాన్ని నిషేధిస్తూ.. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గాంధీ జయంతి రోజు నుంచే ధూమపానాన్ని నిషేధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్‌ కుమార్‌ ధుమాల్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

ఎవరైనా ఈ నిబంధనను మీరితే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. సిమ్లాతో పాటు హిమాచల్‌లోని అన్ని జిల్లా కేంద్రాలను ధూమపాన రహిత పట్టణాలు(స్మోకింగ్ ఫ్రీ సిటీ)గా ప్రకటించింది. వచ్చే ఏడాది మే ఆఖరునాటికి అన్ని జిల్లా అధికార కార్యాలయాలు ధూమపానం నిషేధాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు.

కాగా.. ఇలా ధూమపాన నిషేధాన్ని ప్రకటించిన పట్టణాలలో సిమ్లా నాల్గవది కావడం విశేషం. ఇప్పటికే.. ఛండీగఢ్‌, సిక్కిం, కేరళలోని కొట్టాయం ప్రాంతాలలో ధూమపాన నిషేధం అమలులో ఉంది. అన్ని ప్రాంతాల్లో విద్యార్థులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు డ్రగ్స్‌, మద్యపానం, ధూమపానాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలని ఆయన కోరారు.

అంతే కాకుండా.. ఈ ధూమపాన అలవాటును మాన్పించేందుకు అన్ని జిల్లాల ఆస్పత్రుల్లో డి-అడిక్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం ప్రతి ఆస్పత్రిలోనూ డి-అడిక్షన్‌ కోసం రోగులకు ఐదు పడకలను రిజర్వు చేయాలనని కూడా అబ్బాస్ ఆదేశాలు జారీ చేశారు.

వెబ్దునియా పై చదవండి