సీఎం ఎవరయినా రాహుల్‌ గాంధీకే పాలనా రిమోట్: కాంగ్రెస్

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2012 (12:39 IST)
FILE
ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుని యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ జోస్యం చెప్పింది. మేము 200 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నేత శ్రీ ప్రకాశ్ జైస్వాల్ పేర్కొన్నారు.

అయితే, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరయినా పాలనా పగ్గాలు మాత్రం రాహుల్ గాంధీ చేతిలోనే ఉంటాయని కూడా చెప్పారు. యూపీని ఏలడానికి రాహుల్ ముఖ్యమంత్రే కానవసరం లేదు, ముఖ్యమంత్రి ఎవరయినా రిమోట్ మాత్రం ఆయన చేతిలోనే ఉంటుందని కూడా ఢంకా బజాయించారు.

రానున్న ఐదేళ్లలో యూపీలో రాహుల్ తన పాటవాన్ని ప్రదర్శిస్తారు.. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు అమలవుతున్నాయా లేదో పర్యవేక్షిస్తారని విలేకరులతో చెప్పారు. కాగా, ఈ "రిమోట్ కంట్రోల్" అనే పదం ఈ మధ్య కాలంలో బాగా రాజకీయనేతల్లో వాడుకలోకి రావడం ప్రజాస్వామ్య హితైషులకు రుచించడం లేదు.

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, వారు ఎన్నుకున్న వ్యక్తులే అధికారంలోకి వస్తారు. నిజమైన రిమోట్ వారి చేతుల్లో ఉంటుంది కానీ ఢిల్లీలోనో, మరెక్కడో కాదని వారు అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కించపరచడమేనని వారి వాదన. ఈ రిమోట్ కంట్రోల్ అనే పదం ఒక్క కాంగ్రెస్‌కే పరిమితం కాదు. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో తక్కువ తినలేదు.

1995 ఎన్నికల సమయంలో శివసేన చీఫ్ బాల్ థాకరే తాను ముఖ్యమంత్రి అవడానికి ఇష్టపడడం లేదని చెపుతూ, రిమోట్ పదాన్ని వాడారు. మహారాష్ట్రలో మా పార్టీ అధికారంలోకి వస్తుంది. మా పార్టీలో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. అధికారం రిమోట్ మాత్రం నా చేతుల్లో ఉంటుందని చెప్పారు.

బీహార్‌లో లాలూ ప్రసాద్ అవినీతి కేసులపై అరెస్టయినపుడు తన భార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. వంటగది నుండి భార్యను తీసుకొచ్చి ఎనిమిదేళ్ల పాటు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండబెట్టినా, జైలు నుండే అధికారం చెలాయించారు. తమిళనాడులో పన్నీర్ సెల్వం సంగతి తెలిసిందే.

రిమోట్ కంట్రోల్ అనే పదాన్ని వినియోగించడం ముఖ్యమంత్రి లేదా ఇతర ఉన్నత పీఠాల విలువను దిగజార్చదా? రిమోట్ మీ చేతిలో పెట్టుకుంటే ఇక ఎన్నికలెందుకు అని అడిగే వారి ప్రశ్నలకు కూడా ఆయా పార్టీల దగ్గర సమాధానాలు నాలుక చివరే ఉంటాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల విషయానికే వస్తే, ముఖ్యమంత్రి ఎవరయినా, పీఠాన్ని వెనకుండి నడిపేది రాహుల్ గాంధీయే అన్న మాటలో ఏమాత్రం తప్పులేదని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.

యువనేతపై నమ్మకం పెట్టుకున్న యూపీ ఓటర్లకు భరోసా ఇవ్వాలంటే ఈ తరహా పదాలు వినియోగించకతప్పదని చెపుతున్నాయి. ఎన్నికల్లో రాహుల్ చేసిన విస్తృత ప్రచారం యువతను ఆకర్షించిందని చెప్పారు. ఈ కారణంగానే తొలి దఫా ఎన్నికల్లో పోలయిన ఓట్లలో 15 శాతం యువతరానివే అన్నారు. ఇది మునుపటి కన్నా అధికమన్నారు. తమ ప్రతినిధి అయిన యువనేత రాహుల్ పట్ల అభిమానంతోనే వారు ఓట్లేసేందుకు క్యూలు కట్టారు కానీ, 60 ఏళ్లు పైబడిన బీజేపీ నాయకుడు అద్వానీని చూసి కాదు అంటూ కాంగ్రెస్ నేతలు హాస్యమాడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి