హజారేకు మద్దతుగా 16న ముంబై డబ్బావాలాల సమ్మె

శనివారం, 6 ఆగస్టు 2011 (13:55 IST)
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బలహీనమైన లోక్‌పాల్ బిల్లుకు నిరసనగా ఈనెల 16వ తేదీ నుంచి ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్న విషయం తెల్సిందే. ఆయనకు మద్దతుగా ముంబై డబ్బావాలాలు ఈనెల 16వ తేదీన ఒక రోజు నిరాహారదీక్షతో కూడిన సమ్మె చేయాలని నిర్ణయించారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్‌పాల్ బిల్లు పరిధి నుంచి ప్రధానమంత్రి, న్యాయవ్యవస్థ, పదవిలో ఉండే పార్లమెంట్ సభ్యులను మినహాయించిన విషయం తెల్సిందే. అయితే, ఈ బిల్లు పరిధిలోకి ప్రధానమంత్రిని ఖచ్చితంగా చేర్చాలిందేనంటూ పౌరసమాజం పట్టుబడుతోంది. ఇందుకోసం దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులోభాగంగా ఈనెల 16వ తేదీ నుంచి అన్నా హజారే ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాలని నిర్ణయించారు.

ఈ దీక్షకు ముంబై డబ్బా వాలాలు మద్దతు ప్రకటించారు. దీనిపై ముంబై డబ్బావాలాల సంఘం అధ్యక్షుడు చొప్పన్ మారో మాట్లాడుతూ ముంబైలో నాలుగు నుంచి ఐదు వేల మంది డబ్బావాలాలు ఉన్నారన్నారు. వీరంతా ముంబై నగరంలో ఉద్యోగాలకు వెళ్లే వారికి లంచ్ క్యారియర్లు సరఫరా చేస్తుంటారన్నారు.

తామంతా కలిసి అవినీతిపై పోరాటం చేస్తున్న అన్నా హజారేకు మద్దతుగా నిలవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకోసం ఈనెల 16వ తేదీన టిఫెన్ క్యారియర్లను సరఫరా చేయబోమని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి