హరిద్వార్ శక్తి పీఠ్‌లో తొక్కిసలాట : 16 మంది దుర్మరణం

మంగళవారం, 8 నవంబరు 2011 (15:22 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లోని గాయత్రి శక్తి పీఠ్‌ ఆశ్రమంలో మంగళవారం చోటు చేసుకున్న తొక్కిసలాటలో 16 మంది భక్తులు మృతి చెందారు. మరికొందరు గాయపడగా, వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. స్థానిక గాయత్రీ శక్తిపీఠ్ ఆశ్రమానికి చెందిన గాయత్రీ పరివార్ వ్యవస్థాపకుడు పండిట్ శ్రీ రామ్ శర్మ ఆచార్య శతజయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆ సమయంలో భక్తుల మధ్య ఒక్కసారి తోపులాట చోటు చేసుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ వేడుకల్లో భాగంగా శాంతి కుంజ్ ఆశ్రమంలో జరిగిన యాగ్య పూజల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఒక్కసారి ప్రధాన ద్వారం నుంచి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం. దీనిపై గాయత్రీ పరివార్ అధికార ప్రతినిధి దివేష్ వ్యాస్ మాట్లాడుతూ.. సన్నిటి మార్గం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో అనేక మంది భక్తులు ఊపిరాడక కన్నుమూసినట్టు చెప్పారు.

కాగా, ఐదు రోజుల పాటు సాగే ఈ వేడుకలకు దేశం నలుమూలల నుంచి సుమారు యాభై లక్షల భక్తులు హజరవుతారని భావిస్తున్నారు. వీరిలో ఉత్తరాఖండ్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అవినీతి వ్యతిరేక ఉద్యమకర్త అన్నా హజారే, టిబెట్ బౌద్ధమత గురువు దలైలామాలు కూడా ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి