హిమలింగాన్ని దర్శించుకున్న లక్ష మంది భక్తులు

అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన గత వారం రోజుల్లో మంగళవారం వరకు లక్ష మంది భక్తులు హిమలింగాన్ని దర్శించుకున్నట్టు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. హిమలింగ దర్శనానికి మంగళవారం 12 వేల మంది భక్తులకు అనుమతించినట్టు తెలిపారు.

గత వారం రోజుల్లో ఇప్పటి వరకు లక్ష మంది భక్తులు హిమలింగాన్ని దర్శనం చేసుకున్నారని తెలిపారు. కాగా, ఉత్తర కాశ్మీర్‌‌లోని బల్తాల్ బేస్ క్యాంపు నుంచి ఆరు వేల మంది భక్తులను అనుమతించగా, దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్ బేస్ క్యాంపు నుంచి మరో ఆరు వేల మంది భక్తులను యాత్రకు అనుమతించినట్టు ఆయన తెలిపారు.

ఈ రెండు మార్గాల్లో వాతావరణం కొంతమేరకు మెరుగుపడిందన్నారు. ఫలితంగా క్యాంపులలో ఉన్న భక్తులను యాత్రకు అనుమతిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ యేడాది సహజసిద్ధంగా ఏర్పడిన హిమలింగాన్ని దర్శనం చేసుకునేందుకు 13500 ఎత్తు హిమాలయ పర్వతశ్రేణులపైకి ఎక్కాల్సి ఉంటుందని శ్రీ అమర్‌నాథ్ దేయాలయ బోర్డు (ఎస్ఏఎస్‌బి) వెల్లడించింది.

ఇదిలావుండగా, ఈ యాత్రలో ఇప్పటి వరకు గుండెపోటు కారణంగా 18 భక్తులు మరణించినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. సోమవారం ఒక్కరోజే ఆరుగురు భక్తులు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళా భక్తులు కూడా ఉన్నారు. మరణించిన వారిలో నలుగురు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, ఒకరు గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. మరొక భక్తుడిని గుర్తించాల్సి వుందన్నారు.

వెబ్దునియా పై చదవండి