ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 15 మంది పురుషులను మోసం చేసిన ఓ మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన తమిళనాడు, తిరువారూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరువారూర్ జిల్లా, మన్నార్‌కుడికి చెందిన ఉదయ కుమార్. ఇతనికి గతంలో వివాహమైంది. విడాకులు కూడా తీసుకోవడం జరిగిపోయింది.
ఈ నేపథ్యంలో 2017లో మహాలక్ష్మి అనే మహిళను రెండోసారి వివాహం చేసుకున్నాడు. వివాహమైన కొన్ని రోజుల్లోనే ఉదయకుమార్ సింగపూరుకు ఉద్యోగం కోసం వెళ్లాడు. భార్య అయిన మహాలక్ష్మికి ఉదయకుమార్ అప్పుడప్పుడు డబ్బు పంపేవాడు. ఇటీవల ఫోన్ చేసిన ఉదయ కుమార్‌కు తాను గర్భంగా వున్నానని మహాలక్ష్మి చెప్పింది. దీంతో అనుమానంతో సింగపూర్ నుంచి తిరువారూర్ వచ్చిన ఉదయ కుమార్‌కు షాక్ తగిలింది.
ఇంట మహాలక్ష్మి లేకపోవడంతో ఆమె ఫోన్‌కు స్విచ్చాఫ్ చేయడంతో ఏం చేయాలో తోచక తలపట్టుకున్నాడు. చివరికి మహాలక్ష్మి ఫేస్‌బుక్ అకౌంట్ చూశాడు. ఎఫ్‌బీ అకౌంట్ చూశాకే మహాలక్ష్మి బాగోతం బయటపడింది. అందులో మహాలక్ష్మి పలువురు పురుషులతో వివాహమైనట్లు గల ఫోటోలు వుండటంతో షాకయ్యాడు. ఇంకా పలువురితో సన్నిహితంగా వున్న ఫోటోలను చూసి ఉదయకుమార్ షాకయ్యాడు.
వెంటనే పోలీసులకు మహాలక్ష్మిపై ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహాలక్ష్మి 15మంది పురుషులను మోసం చేసి 25 సవర్ల బంగారం, ఐదు లక్షల రూపాయలతో జంప్ అయినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో పరారీలో వున్న మహాలక్ష్మిని పోలీసులు గాలిస్తున్నారు.