ఆయన పేరు సందీప్ కుమార్. వయసు 36 యేళ్లు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులపై అత్యధిక మెజార్టీతో గెలిచిన ఆప్ ఎమ్మెల్యేల్లో ఒకరు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో స్త్రీశిశు సంక్షేమ శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని సుల్తాన్‌పూర్ మజ్రా నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఈయన.. సీఎం కేజ్రీవాల్ మంత్రివర్గంలో అతి పిన్నవయస్కుడు. ఈయనగారు.. మహిళా దినోత్సవంనాడు చేసిన ప్రసంగం వింటే ప్రతి ఒక్కరూ విస్తుపోవాల్సిందే.
"ఈ ప్రపంచంలోకి నన్ను తీసుకొచ్చి.. పెంచి పెద్ద చేసి, విద్యాబుద్ధులు నేర్పి ఇంతవాణ్ని చేసిన నా తల్లిదండ్రుల పాదాలకు రోజూ ఉదయాన్నే మొక్కుతాను. వారి తర్వాత.. కష్టాల్లోనూ సుఖాల్లోనూ నాకు తోడుగా ఉన్న నా భార్యకూ అంతే గౌరవం ఇస్తాను. మహిళలను గౌరవించనివాడు మనిషే కాడు" అంటూ హితోపదేశం చేశాడు.
కానీ, ఈయన మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతలేకుండా పోయింది. మహిళలను గౌరవించనివాడు మనిషే కాడన్న ఆయన.. భార్యకాని మరో ఇద్దరు మహిళలతో అభ్యంతరకర స్థితిలో దొరికిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మంత్రి పదవిని పోగొట్టుకున్నాు. ఇలా మంత్రిపదవిని పోగొట్టుకున్న మంత్రి ఈయన ఒక్కరే కావడం గమనార్హం.
ఇద్దరు మహిళలతో అభ్యంతరకరమైన స్థితిలో ఉన్న 9 నిమిషాల నిడివిగల సీడీ ఒకటి.. బుధవారం సీఎం కేజ్రీవాల్ కార్యాలయానికి అందింది. దాంట్లో 11 ఫొటోలు కూడా ఉన్నాయి. ఆ సీడీ అందిన వెంటనే కేజ్రీవాల్ ఇంట్లో సమావేశమైన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. "అలాంటి చర్యలను మేం ఎంత మాత్రం సహించం. మాకు 67 మంది ఎమ్మెల్యేలున్నారు. ముఖ్యమంత్రిసహా.. ఎవరు తప్పు చేసినా వెంటనే చర్య తీసుకుంటాం. ఎందుకంటే మిగతా పార్టీలతో పోలిస్తే ఆప్ భిన్నమైనది" అని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ శిశోడియా తెలిపారు.