దేశ రాజధాని హస్తిన పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ముచ్చటగా మూడోసారి సొంతం చేసుకుంది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రేమికుల రోజైన ఈనెల 14వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు, మంత్రివర్గ కూర్పుపై కూడా ఆయన కసరత్తు చేస్తున్నారు.
ఈ దఫా మంత్రివర్గంలో పలువురు యువ ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా, గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఇద్దరు యువ నేతలకు అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వగా, వారిద్దరూ విజయభేరీ మోగించారు. వారు ఎవరోకాదు.. ఒరు రాఘవ్ చాదా కాగా, మరొకరు అతిషి మర్లేనా.
రాజీందర్ సింగ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాఘవ్ చాదా వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. ఈయనకు ఆర్థిక శాఖ కట్టబెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆప్ అధికార ప్రతినిధిగా, పార్టీ లీగల్ అఫైర్స్ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. 2015లో ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ సలహాదారుగా చాదా పని చేశారు. అయితే రాఘవ్ నియామకం చట్టవిరుద్ధమని పేర్కొంటూ కేంద్రం ఆయనతో పాటు మరో 9 మందిని తొలగించింది. దీంతో చాదా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తరపున పోటీ చేసి ఓటమి చవిచూశారు.
అలాగే, కల్కాజీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అతిషి మర్లేనాకు విద్యాశాఖ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో విద్యాశాఖ విషయంలో డిప్యూటీ సీఎం మనీశ్ సిపోడియాకు సలహాదారుగా పని చేసిన అతిషి.. ఢిల్లీ విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆప్ పొలిటికల్ అఫైర్స్ సభ్యురాలిగా ఆమె కొనసాగుతున్నారు. అతిషి కూడా 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.