అమ్మ జయలలిత గెలిచిందనీ... ఒక్కో సీటుకు ఒక్కొక్కరు చొప్పున గుండు చేయించుకున్నారు?

బుధవారం, 25 మే 2016 (08:39 IST)
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఏ పని చేసినా అది సరికొత్తగానే ఉంటుంది. అలాంటి అమ్మ కోసం అన్నాడీఎంకే కార్యకర్తలు కూడా అలాంటి పనులనే చేస్తుంటారు. తాజాగా 134 మంది కార్యకర్తలు కలిసి గుండు చేయించుకున్నారు జయలలిత అమ్మకోసం. 
 
ఇటీవల వెల్లడైన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 134 సీట్లలో విజయభేరీ మోగించి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఫలితంగా జయలలిత ఆరోసారి ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణం చేశారు. ఏఐడీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలలో నూతన ఉత్సాహం ఉప్పొంగింది. 
 
అంతటితో ఆగని ఆమె అభిమానులు... తమ ప్రేమ, అభిమానాన్ని వినూత్నంగా చాటి చెప్పాలనుకున్నారు. ఒక్కో సీటుకు గుర్తుగా ఒక్కరు గుండు చేయించుకున్నారు. మొత్తం 134 సీట్లకు గానూ 134 మంది గుండు చేయించుకుని అమ్మపై అభిమానాన్ని ఇలా ప్రదర్శించారు. అనంతరం అమ్మ నివాసానికి వెళ్లగా వీరిని కలిసేందుకు ముఖ్యమంత్రి ఇష్టపడలేదు.

వెబ్దునియా పై చదవండి