అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం.. అమ్మను ఆస్పత్రిలో నన్ను చూడనివ్వలేదు: పన్నీర్ సెల్వం

బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (12:15 IST)
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తన రాజీనామాను ఉపసంహరించుకోలేదని,  తప్పనిసరైతే రాజీనామా వెనక్కి తీసుకుంటానని ప్రకటించారని.. పార్టీకి తానెప్పుడూ ద్రోహం చేయలేదని, అవసరమైతే ప్రాణ త్యాగం చేసైనా పార్టీని రక్షించుకుంటానని అన్నారు.

అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధమేనని ఓ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నై రాగానే ఆయన్ని కలుస్తానని తెలిపిన పన్నీర్ సెల్వం.. పార్టీ నుంచి కోశాధికారిగా తనను తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు. శశికళ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమేనని వివరించారు.
 
దివంగత తమిళనాడు సీఎం జయలలిత మరణంపై తనకు అనుమానాలు వున్నాయని పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతోపాటు 7కోట్ల తమిళ ప్రజలకు అమ్మ మరణంపై అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఆసుపత్రిలో తనను కూడా అనుమతించలేదని, అమ్మ ఏ కారణంతో మరణించారు? ఆమెకు అంత రహస్యంగా ఎలాంటి ట్రీట్‌మెంట్ అందించారు? మరణానికి అసలు కారణాలేంటి? వంటి విషయాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని పన్నీర్ సెల్వం అన్నారు.

వెబ్దునియా పై చదవండి