తమిళనాడు అసెంబ్లీ స్థానాలు 234.. అమ్ముడుపోయిన ఏడీఎంకే దరఖాస్తులు 26,174... 'అమ్మ' కోసమే 7,936

సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (15:01 IST)
తమిళనాడు రాష్ట్ర శాసనసభ కాలపరిమితి మరో మూడు నెలల్లో ముగియనుంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. ఇందులోభాగంగా అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తుల విక్రయాన్ని ప్రారంభించాయి. అన్ని విషయాల్లో అందరికంటే అధికార అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత ఇతర పార్టీల కంటే ముందుగానే పార్టీ టిక్కెట్ల కోసం ముద్రించిన దరఖాస్తుల విక్రయానికి శ్రీకారం చుట్టారు. ఈ విక్రయ గడువు ఆదివారంతో ముగిసింది. అయితే, గతంలో కంటే ఈ దఫా రికార్డు స్థాయిలో దరఖాస్తులు అమ్ముడు పోయినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యాలయం విడుదల చేసిన ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
 
కాగా, మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లు 234 కాగా, అన్నాడీఎంకే తరపున పోటీ చేసేందుకు ఔత్సాహిక అభ్యర్థులు కొనుగోలు చేసి దరఖాస్తులు  26174. ఇందులో ముఖ్యమంత్రి జయలలిత తమ నియోజకవర్గంలో పోటీ చేయాలని కోరుతూ సమర్పించిన దరఖాస్తుల సంఖ్య 7936గా ఉన్నాయని తెలిపింది. 
 
అంతేనా పార్టీ దరఖాస్తుల విక్రయం ద్వారా పార్టీ ఖజానాకు ఏకంగా రూ.28.40 కోట్లు సమకూరినట్లు కూడా ఆ పార్టీ ప్రకటించింది. వచ్చిన దరఖాస్తుల్లో తమిళనాడు నుంచే 17,698 ఉన్నాయి. ఇక పుదుచ్చేరి నుంచి 332, కేరళ నుంచి 208 దరఖాస్తులు వచ్చాయి. కాగా, ఒక్కో దరఖాస్తు ఫీజుగా తమిళనాడులో రూ.11 వేలు, పుదుచ్చేరిలో రూ.5 వేలు, కేరళలో 2 వేలు చొప్పున నిర్ణయించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి