చెన్నైకు గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ఇప్పట్లో రారట...

బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (16:25 IST)
తమిళనాడు రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ముంబైలోనే ఉన్నారు. ఈయనకు ఇప్పట్లో చెన్నైకు వచ్చే ఆలోచన లేదట. దీని వెనుక కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉండటమేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  
 
మహరాష్ట్ర గవర్నర్ అయిన ఆయన తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్‌గా ఉన్నారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం స్థానంలో జయలలిత నెచ్చెలి వీకే శశికళను ఎన్నుకుంటూ ఏఐఏడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజు ఢిల్లీ వెళ్లిన గవర్నర్ అక్కడి నుంచి నేరుగా ముంబైకి చేరుకున్నారు. శశికళ ప్రమాణ స్వీకారం గవర్నర్ చేతిలో ఉండటంతో ఆయన ఎప్పుడు చెన్నై వస్తారా ఎదురు చూస్తుండగా.. గవర్నర్ మాత్రం బుధవారం తమిళనాడు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. 
 
కనీసం గురువారం వరకు ఆయన ముంబైలోనే ఉండేందుకు ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం గవర్నర్ ముంబైలోనే ఉన్నారనీ... బుధవారం సాయంత్రం 5 గంటలకు ఓ కెమికల్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారని రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. 
 
చెన్నై ఎప్పుడు వస్తారన్న దానిపై బుధవారం సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మంగళవారం ప్రస్తుత ముఖ్యమంతి శశికళపై తిరుగుబావుటా ఎగురవేయడంతో చెన్నైలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడిక్కిన సంగతి తెలిసిందే. దీంతో గవర్నర్ శశికళ ప్రమాణ స్వీకారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

వెబ్దునియా పై చదవండి