అబ్దుల్ కలాంకు ఆ ముగ్గురమ్మలంటే ఇష్టమట.. ఎవరా ముగ్గురో తెలుసా?

మంగళవారం, 28 జులై 2015 (14:50 IST)
మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, ఏపీజే అబ్దుల్ కలాంకు ఆ ముగ్గురమ్మలంటే ఇష్టమట. ఆ ముగ్గురమ్మల కథలంటే ఇష్టమని, వారందరినీ తాను కలవగలిగానని కలాం చెప్పారు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే.. 'ఒకరు మా సొంత అమ్మ. మరొకరు భారత సంగీతానికి అమ్మ.. ఎంఎస్ సుబ్బలక్ష్మి. మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ థెరిస్సా' అని కలాం ఓ ఉపన్యాసంలో గుర్తు చేసుకున్నారు. 
 
1950లో తిరుచ్చిలో తాను చదువుకుంటున్నప్పుడు విన్న 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు' అన్న పాట తనను పరవశంలో ముంచెత్తిందని, అప్పటి నుంచి ఆమె సంగీతాన్ని ఎంతగానో అభిమానించానన్నారు. 'ఆమె భారతరత్న అవార్డు తీసుకునే సమయంలో నా తల నిమిరింది. ఆ ఘటనను నేనెప్పటికీ మరవలేను' అని ఉద్వేగంతో చెప్పారు. దేశం కాని దేశంలో పుట్టి.. మన దేశానికి నలభైఏళ్ల పాటు అమూల్య సేవల్ని అందించిన మదర్ థెరిస్సా తాను అభిమానించే మూడో అమ్మగా కలాం వెల్లడించారు.
 
ఇకపోతే, అబ్దుల్ కలామ్ శాకాహారి. మధ్యపాన వ్యతిరేకి. బ్రహ్మచారి. కచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తారు. "ప్రజలు తమ భార్యాపిల్లల బాగోగుల కోసం ఆస్తులు సంపాదించి పెట్టడమే కాకుండా అవినీతిపరులు అవుతారు ఈ కారణంతోనే కలాం పెళ్లి చేసుకోలేదు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి. ఖురాన్‌తో పాటు, భగవద్గీతను కూడా కలాం చదువుతారు. మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడు. మానవతావాది. తిరుక్కురళ్‌లో చెప్పిన మార్గాన్ని అనుసరిస్తారు. ఆయన చేసే ప్రతి ప్రసంగంలోనూ కనీసం ఒక్క "పాశురం" నైనా ప్రస్తావిస్తారు.

వెబ్దునియా పై చదవండి