సోనియా జీ...మాఫ్ కీజియే..! : బీజేపీ ఎంపి క్షమాపణలు

మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (06:45 IST)
తెల్లతోలుతోనే అధ్యక్ష పదవి అంటూ వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రి గిరిరాజ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి క్షమాపణలు చెప్పారు. మనసు నొప్పించి ఉంటే క్షమించాలంటూ పార్లమెంటు సమావేశాలలో సోమవారం ఉదయం అన్నారు. మలివిడత సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం సభ మొదలవగానే ఈ అంశంపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్‌ డిమాండ్ చేసింది. 
 
దీనిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ క్షమాపణలు చెప్పాలంటూ జ్యోతిరాధిత్యసింధియా డిమాండ్‌ చేశారు. అయితే, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తిరస్కరించారు. దీంతో దీనిపై చర్చజరపాలంటూ కాంగ్రెస్‌ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కేంద్రమంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ జ్యోతిరాధిత్య ఆరోపించారు. 
 
మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్‌సింగ్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. గందరగోళం మధ్య సభను స్పీకర్‌ కొద్దిసేపు వాయిదా వేశారు. చివరకు సోనియాపై చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ క్షమాపణలు చెప్పారు. నా మాటలు ఎవరినైనా బాధపెడితే క్షమించండి అని ఆయన అన్నారు.
 

వెబ్దునియా పై చదవండి