ఉగ్రవాదం అడ్డుకట్టకు ఉరిశిక్షలు తప్పవు : అరుణ్ జైట్లీ

శనివారం, 1 ఆగస్టు 2015 (10:10 IST)
దేశంలో ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలంటే ఉరిశిక్షల అమలు తప్పదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. ముంబై వరుస బాంబు పేలుళ్ళ కేసులో దోషిగా తేలిన యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేశారు. ఈ శిక్ష అమలుపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు మంత్రి జైట్లీ కౌంటర్ ఇచ్చారు. 
 
ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలంటే ఉరిశిక్షలు తప్పవని స్పష్టంచేశారు. యాకూబ్‌ను ఉరితీయడం తమను బాధించిందని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారని, అప్పట్లో ఇందిరా గాంధీ హత్య కేసులో దోషులను ఉరి తీస్తున్నప్పుడు వారంతా ఎక్కడికెళ్లారని జైట్లీ సూటిగా ప్రశ్నించారు. 
 
ముంబై పేలుళ్ల కేసులో ఇంకా కొందరు దొరకాల్సి ఉందని, వారిని కూడా యాకూబ్ తరహాలో ఉరితీయక తప్పదని, మున్ముందు మరిన్ని ఉరితీతలు ఉంటాయని తెలిపారు. సాధారణంగా ఎవరూ కూడా మరణశిక్షను ఇష్టపడరని అన్నారు. ఎవరికైనా మరణశిక్ష విధించేటప్పుడు కోర్టులు వివేచన ప్రదర్శిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
 
అలాగే, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా స్పందించారు. దేశద్రోహి అయిన మెమన్‌ ఉరిశిక్ష సందర్భంగా ప్రసార మాధ్యమాలు అతనికి ఇచ్చిన ప్రచారం అనుచితమని, ఇలా ఏ దేశంలోనూ జరగదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారం భారతదేశ వాదనను బలహీన పరుస్తోందని వెంకయ్య చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి