వెస్ట్‌గోదావరి జిల్లాలో నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపులు భరించలేక, వ్యక్తిగత రుణం (పర్సనల్ లోన్) తీసుకునే విషయంలో భర్తతో ఏర్పడిన మనస్పర్థలతో విసిగిపోయిన ఆ మహిళ బలవన్మరణమే శరణ్యమని భావించింది. ఫలితంగా తనువు చాలించింది. ఈ విషాదకర ఘటన బెంగుళూరులో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిడదవోలు 4 వార్డుకు చెందిన రావి ధనంజయరావు, ధనలక్ష్మీలకు కుమార్తె జయమాధవి, కుమారుడు శ్రీనివాసరావు అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో శ్రీనివాసరావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి ధనంజయరావు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఈ క్రమంలో 2018 మార్చిలో కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన గాదిరెడ్డి శివ సుబ్రహ్మణ్యంతో జయమాధవికి వివాహం చేశారు. వివాహ సమయంలో వరకట్నం రూ.30 లక్షలు, 300 గ్రామలు బంగారం, రూ.2 లక్షల ఆడపడుచు కట్నం ఇచ్చారు. భార్యాభర్తలిద్దరూ బెంగుళూరుకు మకాం మార్చారు. జయమాధవి డెలెట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. భర్త శివ సుబ్రహ్మణ్యం అదే నగరంలోని ఐబీఎం కంపెనీలో డెలివరీ మేనేజర్‌గా పనికి చేరాడు.
తన కుమార్తె ఉరివేసుకునేంత పిరికిది కాదని, ఆమెను భర్త, అత్తగారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రికరించే ప్రయత్నం చేశారని ధనంజయరావు ఆరోపిస్తున్నాడు. ఎనిమిది నెలల గర్భిణిని పొట్టన పెట్టుకున్నారని కన్నీరు మున్నీరయ్యాడు. తన కుమార్తె గొంతు మీద గాయాలు ఉన్నాయని, దారుణంగా చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బెంగళూరు కేఆర్ పురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్త శివసుబ్రహ్మణ్యంను పోలీసులు అరెస్టు చేశారు.