బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు కరోనా పాజిటివ్!

ఆదివారం, 13 డిశెంబరు 2020 (22:17 IST)
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 
 
గత కొన్నిరోజులుగా కరోనా ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా, పాజిటివ్ అని తేలిందని తెలిపారు. అయితే తాను బాగానే ఉన్నానని, డాక్టర్ల సలహా మేరకు అన్ని మార్గదర్శకాలు పాటిస్తూ ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నానని జేపీ నడ్డా వివరించారు. 
 
గత కొన్నిరోజులుగా తనను కలిసి వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు. కాగా, జేపీ నడ్డాకు కరోనా సోకిన విషయంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. 
 
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి కరోనా పాజిటివ్ అనే విషయం తనకు తెలిసిందని, కొవిడ్ నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని భద్రకాళి మ్మవారిని వేడుకుంటున్నానని ట్వీట్ చేశారు.
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు మరో 4966 నమోదయ్యాయి. ఈ మేరకు ఆదివారం ఏపీ వైద్యఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఏపీలో 4,966 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 63,873 కరోనా పరీక్షలు నిర్వహించగా 506 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
 
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 104 కొత్త కేసులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో 69, పశ్చిమ గోదావరి జిల్లాలో 66, కృష్ణా జిల్లాలో 59 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కడప జిల్లాలో 12, విజయనగరం జిల్లాలో 13, అనంతపురం జిల్లాలో 17 కేసులు వెల్లడయ్యాయి. 
 
అదేసమయంలో 613 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఐదుగురు మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 8,75,531 కరోనా కేసులు నమోదవగా 8,63,508 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య 7,057కి చేరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు