శివసేనలోకి బాలీవుడ్‌ నటి ఊర్మిళ

మంగళవారం, 1 డిశెంబరు 2020 (22:31 IST)
బాలీవుడ్‌ నటి ఊర్మిళ మతోంద్కర్‌ శివసేనలో చేరారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రే నివాసం మాతోశ్రీలో ఆమె శివసేన తీర్థం పుచ్చుకున్నారు. సీఎం సతీమణి రష్మీ థాక్రే ఊర్మిళకు శివసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను శివసేన తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. కాంగ్రెస్‌ను వీడిన ఏడాది తర్వాత శివసేనలో చేరిన ఊర్మిళ త్వరలోనే శాసనమండలిలో అడుగుపెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి.

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన ఊర్మిళ తొలుత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు.

ఆ తర్వాత కొద్ది నెలలకే ముంబై కాంగ్రెస్‌ నేత వ్యవహారశైలి నచ్చకపోవడంతో గతేడాది సెప్టెంబరులో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు.

మహారాష్ట్ర శాసనమండలిలో గవర్నర్‌ కోటాలో ఖాళీ అయిన 12 స్థానాలను భర్తీ చేసేందుకు అక్టోబరులో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది పేర్లను సిఫార్సు చేసింది. ఇందులో ఊర్మిళ పేరు కూడా ఉంది.

ఆమె పేరును శివసేన ప్రతిపాదించింది. దీంతో అప్పట్లోనే ఆమె శివసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. మంగళవారం ఆమె అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఊర్మిళ పేరును గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆమోదిస్తే త్వరలోనే ఆమె ఎమ్మెల్సీ బాధ్యతలు చేపట్టే అవకాశముంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు