భగత్‌సింగ్ చేయలేని పని నేను చేశాను : బీఎస్ఎఫ్ జవాన్ సవాల్

బుధవారం, 11 జనవరి 2017 (04:13 IST)
అవినీతిని అరికట్టే విషయంలో భారత జాతీయ విప్లవకారుడు భగత్ సింగ్ చేయలేని పనిని తాను చేశానని బీఎస్ఎప్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ తేల్చి చెబుతున్నాడు. సరిహద్జుల్లోని సైనికుల జీవన పరిస్థితులపై విమర్శ చేస్తూ ఫేస్‌బుక్‌లో వీడియో అప్‌లోడ్ చేసినందుకు గాను తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న ఈ జవాను తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు కానీ ఇక వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. 
 
సరిహద్దుల్లోని సైనికులకు తిండి కూడా సరిగా పెట్టలేదని, పస్తులతో నిద్రపోవాల్సి వస్తోందని, అధకారుల అవినీతే దీనికి కారణమని పేర్కొంటూ బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ సోమవారం మూడు వీడీయోలను అప్‌లోడ్ చేయడం సంచలనానికి దారితీసింది. ఈ ఘటనపై హోంమంత్రి రాజనాథ్ సింగ్ తక్షణం విచారణకు ఆదేశించారు. బీఎస్ఎఫ్ అధికారులు ఈ ఆరోపణపై విచారణ చేపట్టారు కూడా. 
 
కానీ బీఎస్‌ఎఫ్ విచారణపై తనకు నమ్మకం లేదంటూ యాదవ్ మరొక ఆడియో క్లిప్‌ను మంగళవారం మళ్లీ పోస్ట్ చేశాడు. సైనికుల దుస్థితిపై తాను చేసిన పనివల్ల వేలాది ఇతర జవాన్లకు మేలు చేకూరితే ఇక తాను వెనుదిరిగే ప్రసక్తే లేదని అన్నాడు.  దేశవ్యాప్తంగా వైరల్ అయిన యాదవ్ ఫేస్‌బుక్ పోస్టు కారణంగా అధికారులు క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చంటున్న నేపథ్యంలో తాను వెనక్కు తగ్గేది లేదని యాదవ్ స్పష్టం చేశాడు. 
 
సోమవారం తను అప్‌లోడ్ చేసిన వీడియోలను 60 లక్షల నుంచి 70 లక్షల మంది ప్రజలు చూశారని తెలిసింది. ఇంతమంది చూడటం ఇదే తొలిసారి. భారత్ కచ్చితంగా మేలుకొంటుందనటంలో సందేహం లేదు. అయితే యాదవ్ విడుదల చేసినట్లు చెబుతున్న ఈ కొత్త ఆడియో తమ దృష్టికి రాలేదని బీఎస్ఎఫ్ అధిరారులు స్పష్టం చేశారు. 
 
సైన్యంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను ధైర్యంగా వెల్లడించిన ఈ జవానును తాగుబోతు అని ప్రచారం చేయడానికి కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు సైన్యం వరకూ వ్యాపించిన అవినీతి జాడ్యం పట్ల అసహ్యం ప్రదర్శిస్తున్నారు.
 
ప్రభుత్వం తమకు సరిపడినంత ఆహారాన్ని పంపిస్తున్నప్పటికీ సీనియర్లు, అధికారులు ఆ ఆహార పదార్థాలను అక్రమంగా మార్కెట్లో అమ్ముకుంటూ సాధారణ సైనికులు కడుపు మాడుస్తున్నారని బీఎస్ఎఫ్ 29వ బెటాలియన్‌కు చెందిన యాదవ్ అనే జవాను ఆ వీడీయోల్లో ఆరోపించాడు. అంతేకాకుండా ఆ సైనికుడు తనకు ఇస్తున్న ఆహారాన్ని కూడా ఆ వీడియోల్లో ప్రదర్శించాడు. 
 
ఉదయం అల్పాహారంగా కేవలం ఒక పరోటాను, టీని మాత్రమే మాకు ఇస్తున్నారని ఆరోపించాడు. అందులో కూడా ఊరగాయ కానీ, కూరగాయలు కాని ఉండవు. మేం 11 గంటలపాటు డ్యూటీ చేయవలసి వస్తుంది. ఒక్కోసారి డ్యూటీ సమయం పొడవునా మేం నిలబడాల్సి వస్తుంది. ఇక భోజనం సమయంలో తమకు పసుపు, ఉప్పు కలిపిన పప్పుకూరను రోటీతో కలిపి ఇస్తారనీ, సరిహద్దుల్లో తమకు ఇస్తున్న ఆహారం ఇదేననీ, ఇలాంటి పరిస్థితుల్లో ఒక జవాన్ తన డ్యూటీని ఎలా చేయగలడని ప్రశ్నించాడు. తమ దుస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదనీ, ఈ విషయంపై విచారించాలని ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నానని ఆ సైనికుడు తెలిపాడు. 
 
సరిహద్దుల్లో సైనికుల దుస్థితి గురించి బయటి ప్రపంచానికి తెలిపినందుకుగాను నన్ను ఇక్కడ ఉంచకపోవచ్చు. తనపై చర్య కూడా తీసుకోవచ్చంటూ సవాల్ విసిరిన ఆ సైనికుడు ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలని, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అభ్యర్థించాడు. కొన్నిసార్లు ఖాళీ కడుపుతోనే తాము నిద్రపోవలసి వస్తోందని అతడు ఆరోపించాడు. ఈ వార్త బయటకు పొక్కిన వెంటనే బీఎస్ఎఫ్ దీనిపై విచారణ చేస్తామని పేర్కొంది. 
 

వెబ్దునియా పై చదవండి